CM Revanth Reddy , Telangana Assembly
* సీఎం రేవంత్‌రెడ్డి
* స్పీకర్ ప్రసాద్‌కు పరామర్శ
* ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చోటు చేసుకున్న దురదృష్టకర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శాసన సభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన ఛాంబర్లో పరామర్శించారు. శాసనసభ ప్రారంభమైన తొలిరోజే అసెంబ్లీ ఆవరణలో సభాపతి పట్ల కొందరు సభ్యులు తీవ్ర అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా, విధుల్లో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ తరహా ప్రవర్తన అత్యంత అనుచితమని, ఇది మొత్తం తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం, డిప్యూటీ సీఎం ఓదార్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనను పత్రికలు, టీవీ ఛానెళ్లు, డిజిటల్ మీడియాలు ప్రముఖంగా ప్రసారం చేశాయి. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న సభాపతిని వ్యక్తిగతంగా దూషించడంతో ఆయన శాసనసభా వేదికగానే కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రభుత్వం మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, సభాపతి హోదాను దిగజార్చేలా ప్రవర్తించిన బాధ్యులపై చట్టపరంగా, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పీకర్‌కు సీఎం హామీ ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
