FIR filed on KTR and Harish Rao
* మరో 14 మందిపై ఎఫ్ఐఆర్
* తెలంగాణలో వేడెక్కిన రాజకీయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
కేటీఆర్, హరీష్‌రావుతో పాటు మరో 14 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ భవనం వద్ద ఇటీవల జరిగిన ఆందోళన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా జరిగిన రభస, నిరసనలకు సంబంధించి పోలీసులు అత్యంత కఠినమైన చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడికి దిగడం, అధికారుల పట్ల అపరాధపూరిత శైలిలో ప్రవర్తించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో బీఆరఎస్‌కు చెందిన అగ్ర నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులపై కేసు నమోదు చేశారు. రాజధానిలోని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన ఈ కేసు తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఉద్రిక్తతను నింపింది.
* ఎవరెవరిపై అంటే..
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లొ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జి. జగదీష్ రెడ్డి, పి. సబితా ఇంద్రా రెడ్డి, వి. సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, డాక్టర్ సంజయ్, గంగుల కమలాకర్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు, శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు నాయకుల పేర్లను కూడా చేర్చారు. ఆందోళనలో పాల్గొన్న నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించారని పోలీసులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
* పోలీసులతో తోపులాట ఘటనలో..
అసెంబ్లీ వద్ద ప్రజా సమస్యలపై నిరసన తెలపడానికి చేరుకున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు వారిని నిరోధించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయగా, ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ నవసంహిత చట్టంలోని 121(1), 132, 74, 79, 351, 352, 353 తో పాటు 3(5) సెక్షన్ల కింద ఈ క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, క్రిమినల్ బలప్రయోగం చేయడం, శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి.
* కాంగ్రెస్, బీఆర్ఎస్ వేడెక్కిన రాజకీయం
ఈ కేసుల నమోదుపై రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్రమయ్యాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తోందని కేటీఆర్, హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి నిర్బంధాలు విధించినా ప్రజా క్షేత్రంలో ప్రజల తరఫున నిలబడి పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మరోవైపు చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రజాప్రతినిధులైనంత మాత్రాన చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అధికార కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడులకు తెగబడటం, ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉండటం, తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఎటువంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
