Mulugu Collector Hemant Sahadevarao
* జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
* పర్యావరణం, శాస్త్రీయ అధ్యయనాలపై చర్చ
ఆకేరు న్యూస్, ములుగు: యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
* రామప్ప ఆలయానికి నష్టం జరగకుండా చర్యలు
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ సమావేశం జరిగింది. వెంకటాపూర్ మండల పరిధిలో చేపడుతున్న ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పనులు రామప్ప దేవాలయంపై చూపే ప్రభావంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) మంజూరు అంశంతో పాటు, మైనింగ్ కార్యకలాపాల కారణంగా ఆలయ నిర్మాణానికి లేదా పరిసర ప్రాంతాలకు ఎలాంటి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
* పర్యావరణం, శాస్త్రీయ అధ్యయనాలపై చర్చ
రామప్ప దేవాలయ పరిరక్షణతో పాటు పర్యావరణ ప్రభావం, శాస్త్రీయ అధ్యయనాలు, నిరంతర పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. సంబంధిత నిబంధనలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు సంబంధించిన తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
* సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సింగరేణి భూపాలపల్లి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జీఎం జి. దేవేందర్, పర్యావరణ విభాగం జీఎం పి. సైదులు, ఎక్స్‌ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్. సునీత, పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు బి. గంగాదేవి పాల్గొన్నారు.
భారత పురావస్తు సర్వేక్షణ శాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్లు అజిత్ ఎం.ఎస్., వంశీకృష్ణ జ్యోతి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు జె. శ్రీధర్‌రావు, ఆచార్య ఎం. పాండురంగారావు, పాలంపేట సర్పంచ్ సీహెచ్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి కె. వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ, ఇరిగేషన్ ఈఈ నారాయణ, వెంకటాపూర్ తహసిల్దార్ గిరిబాబు, ఎంపీడీవో రాజుతో పాటు సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
