Old City Metro
* ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ..
* అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన వస్తుందని ఎదురుచూపులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
హైదరాబాద్‌లోని పాతబస్తీకి మెట్రో రైలు కనెక్టివిటీ కలగానే మిగిలిపోతోంది. గత ప్రభుత్వంతోపాటు, రేవంత్ రెడ్డి సర్కారు కూడా దీనిపై స్పష్టమైన ప్రకటలు ఇచ్చింది. అయితే ఆచరణలోకి వచ్చేసరికి అడుగు ముందుకు పడకపోవడం స్థానికులను నిరాశకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న జాప్యం చూస్తుంటే ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ అన్న చందంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సైదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో మెట్రోలోనే ఓల్డ్‌సిటీకి వస్తానని చేసిన ప్రకటన మళ్లీ ఆశలు రేకెత్తించింది.
* అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వేళ పాతబస్తీ ప్రజల చూపు పూర్తిగా సభపైనే నిలిచింది. మెట్రో రెండో దశ విస్తరణ, ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్, బడ్జెట్ కేటాయింపులు మరియు కచ్చితమైన డెడ్‌లైన్‌తో కూడిన అధికారిక ప్రకటన వెలువడుతుందని ఇక్కడి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కేవలం రాజకీయ వేదికలపై జరిగే ప్రకటనలకే పరిమితం కాకుండా, శాసనసభ సాక్షిగా స్పష్టత ఇస్తేనే పనులపై ఒక నమ్మకం కుదురుతుందని స్థానికులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని సీరియస్ గా చేపడుతుందని ఆశిస్తున్నారు.
* ట్రాఫిక్ చిక్కులు.. అభివృద్ధికి అడ్డుకట్ట..
చారిత్రక కట్టడాలు, కిక్కిరిసిన రద్దీ మార్కెట్లు, ఇరుకైన రోడ్లతో నిత్యం కిటకిటలాడే పాతబస్తీలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్‌లు సామాన్యుల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా గంటల తరబడి సమయం వృథా అవుతుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, పాతబస్తీ మాత్రం రవాణా సౌకర్యాల లేమితో వెనుకబడిపోతోంది.
* ఎన్నో సవాళ్లు..
గత ప్రభుత్వాల హయాంలోనూ పాతబస్తీ మెట్రోపై ఎన్నో హామీలు, శంకుస్థాపనలు జరిగాయేకానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక పరమైన చిక్కులు, కేంద్ర ప్రభుత్వ అనుమతుల జాప్యం వంటి అంశాలు తీవ్ర సవాళ్లు విసురుతున్నాయి. ఒకవేళ కేంద్రం నుంచి సహకారం అందకపోతే సొంత నిధులతోనైనా పనులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఆ మాటలకు అనుగుణంగా బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసి, తక్షణమే పనులు ప్రారంభించాల్సి ఉంది. కేవలం రాజకీయ వేదికలపై నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తేనే దశాబ్దాల పాతబస్తీ ప్రజల మెట్రో కల నిజమవుతుంది.
* ముప్పై ఏళ్ల కల..
హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రణాళిక రూపుదిద్దుకున్న నాటి నుంచీ పాతబస్తీ మార్గం (ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు) వివాదాలు, రాజకీయ జాప్యం, కోర్టు కేసులు మరియు ఆస్తుల సేకరణ తదితర సమస్యలతో సతమతమవుతూనే ఉంది. ఇప్పటికే ఇక్కడ దాదాపు 888 ఆస్తుల సేకరణ ప్రక్రియలో 833 ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, మిగతా ప్రక్రియ పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు మరియు ఆర్థిక సర్దుబాటులో తలెత్తుతున్న సవాళ్లు ఈ ప్రాజెక్టును ముందుకు కదలనీయకుండా చేస్తున్నాయి.
* సొంత నిధులతో చేపట్టేనా?
రూ. 38,595 కోట్లతో చేపట్ట తలపెట్టిన రెండో దశ డీపీఆర్‌లు 2024 నవంబర్లోనే కేంద్రానికి చేరినప్పటికీ, అక్కడి నుంచి ఆమోదం లభించడంలో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టును నీరుగారుస్తోంది. మరోవైపు, కేంద్ర-రాష్ట్రాల జాయింట్ వెంచర్‌గా ఉన్న ఈ ప్రాజెక్టులో ఐఆర్ఎఫ్సీ రుణాలు చివరి క్షణంలో రాకపోవడం వంటి పరిణామాలు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఒకవేళ కేంద్రం నుంచి స్పందన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతోనైనా పనులు చేపడుతుందని చెబుతోంది. అయితే అప్పుల ఊబిలో ప్రభుత్వం కూరుకున్న నేపథ్యంలో అది ఎంత వరకు సాధ్యపడుతుందనే మీమాంస సర్వత్రా వ్యక్తమవుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
