Swachh Vayu Sarvekshan 2026
* విజయవాడ 8వ ర్యాంక్
* హైదరాబాద్, విశాఖ కంటే ముందంజ
ఆకేరు న్యూస్, డెస్క్: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ (Swachh Vayu Sarvekshan)–2026 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నగరాలు సత్తా చాటాయి. విజయవాడ, గుంటూరు, ఎలూరు నగరాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడ 8వ స్థానంలో నిలిచి హైదరాబాద్, విశాఖపట్నం కంటే ముందంజలో నిలిచింది.
* విజయవాడకు 8వ ర్యాంక్
మిలియన్ ప్లస్ నగరాల విభాగంలో విజయవాడ 186 పాయింట్లతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ 174.2 పాయింట్లతో 19వ స్థానంలో, విశాఖపట్నం 172 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద నగరాలతో పోలిస్తే విజయవాడ మెరుగైన పనితీరు కనబరిచింది.
ఈ విభాగంలో లక్నో 198 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. ఇండోర్ 197 పాయింట్లతో రెండో స్థానంలో, జబల్పూర్ 195 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. విజయవాడకు, హైదరాబాద్‌కు మధ్య 12 పాయింట్లు, విజయవాడకు–విశాఖకు మధ్య 14 పాయింట్ల తేడా ఉండటం విశేషం.
* గుంటూరుకు రెండో స్థానం
మధ్యస్థాయి నగరాల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు మరింత మెరుగైన ఫలితం వచ్చింది. 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు 195 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 198.5 పాయింట్లతో రూర్కెలా మొదటి స్థానాన్ని సాధించింది. అమరావతి 194 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. నెల్లూరు 187 పాయింట్లతో 9వ స్థానంలో, రాజమండ్రి 180 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాయి. కర్నూలు 162 పాయింట్లతో 29వ స్థానంలో ఉండగా.. కడప, అనంతపురం 144 పాయింట్లతో సంయుక్తంగా 34వ స్థానంలో నిలిచాయి.
* ఎలూరుకు టాప్-5
మూడు లక్షల లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలోనూ ఏపీ నగరాలు మంచి ప్రదర్శన చేశాయి. ఎలూరు 193 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. విజయనగరం 189.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని, శ్రీకాకుళం 185.5 పాయింట్లతో 11వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఒంగోలు 168.5 పాయింట్లతో 25వ స్థానంలో, చిత్తూరు 167.8 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచాయి.
* తెలంగాణలో …
తెలంగాణ విషయానికి వస్తే మిలియన్ ప్లస్ నగరాల విభాగంలో హైదరాబాద్ 19వ స్థానంలో నిలిచింది. అయితే రాష్ట్రంలోని చిన్న, మధ్యస్థాయి నగరాలు మాత్రం మెరుగైన ఫలితాలు సాధించాయి. సంగారెడ్డి 186.8 పాయింట్లతో 8వ స్థానంలో, నల్గొండ 185.8 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
