Yuvraj Soni
* ఢిల్లీ పీజీ శిథిలాల్లో యువరాజ్
ఆకేరు న్యూస్, రాయ్‌పూర్ : చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనే కలతో ఢిల్లీ వెళ్లిన దుర్గ్‌కు చెందిన 20 ఏళ్ల యువరాజ్ సోనీ జీవితం విషాదంగా ముగిసింది. ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ భవనం కూలిన ఘటనలో మృతి చెందిన ఏడుగురిలో యువరాజ్ కూడా ఉన్నాడు.
రక్షాబంధన్ సందర్భంగా కొద్ది రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో గడిపిన యువరాజ్.. చదువుల కోసం తిరిగి ఢిల్లీ వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి వస్తానని వెళ్లిన యువకుడు.. చివరకు నిర్జీవంగా కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకున్నాడు.
ఫోన్ మాట్లాడుతుండగానే..
భవనం కూలిన సమయంలో యువరాజ్ తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఒక్కసారిగా ఫోన్ కాల్ నిలిచిపోయింది. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడి నుంచి స్పందన రాలేదు. యువరాజ్ తండ్రి కన్హయ్య సోనీ ఛత్తీస్‌గఢ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. యువరాజ్ ఆయనకు ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబంలో తల్లితో పాటు ఒక చెల్లెలు ఉన్నారు.
ఏడుగురి ప్రాణాలు..
సత్య నికేతన్‌లో కూలిపోయిన పీజీ భవనంలో మొత్తం ఏడుగురు మృతి చెందగా.. వారిలో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు కార్మికులు ఉన్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సుమారు నాలుగు దశాబ్దాల నాటి ఈ భవనాన్ని ‘హాస్టల్ డేజ్’ పేరుతో విద్యార్థుల వసతిగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
