CM Chandrababu
* నీరు, భూమికే కూటమి సర్కార్ ప్రాధాన్యం
ఆకేరు న్యూస్, పి. గన్నవరం : భూ సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పి. గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సచివాలయానికే పరిమితం కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి, సంక్షేమం మరియు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
గత పాలకులు భూ రికార్డులను తారుమారు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. ఇప్పుడు అత్యంత భద్రతతో కూడిన ఈ-కేవైసీ (e-KYC), క్యూఆర్ కోడ్ (QR Code), బ్లాక్ చైన్ సాంకేతికతను ఉపయోగించి రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని వివరించారు. నూతనంగా తెచ్చిన ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా ఇప్పటికే 1.25 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. పూర్వీకుల భూముల పాస్ పుస్తకాలపైనా, ఖరీదైన గ్రానైట్ సర్వే రాళ్లపైనా గత పాలకుల బొమ్మలు వేసుకోవడంపై మండిపడ్డారు.
భూ సమస్యలకు పరిష్కారం
పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన భూ వివాదాలను ఒక్కొక్కటిగా కొలిక్కి తెస్తోందని సీఎం వెల్లడించారు. పొలిటికల్ కక్ష సాధింపులతో గతంలో ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులను 22ఏ జాబితాలో పెట్టారని విమర్శిస్తూ, ఇప్పటివరకు ఏకంగా 16 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అలాగే 1908 నుంచి అమలాపురంలోని మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రాపురం పరిధిలో 22ఏ1 కింద నిషేధంలో ఉన్న 56.37 ఎకరాల భూమి వివాదాన్ని పరిష్కరించి 1,410 మందికి హక్కులు కల్పించామని ప్రకటించారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కలిదిండి, కంగుంది, ముదినేపల్లి తదితర ప్రాంతాల్లో 120 ఏళ్లుగా నలుగుతున్న భూ సమస్యలను కూడా పరిష్కరించినట్లు తెలిపారు.
సుపరిపాలన – సంక్షేమ బాట
ప్రతి నెలా 1వ తేదీన ‘పేదల సేవలో’ పేరుతో ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, P4 విధానం ద్వారా పేదల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నెలా 3వ శనివారం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కింద చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, 4వ శనివారం ‘సంజీవని’ కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను ఏర్పాటు చేస్తూ ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
