MLC Balmoor Venkat, Telangana Police Jobs
* 3.8 మీటర్లకు తగ్గించాలని బల్మూర్ వెంకట్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో లాంగ్‌జంప్ నిబంధనను సడలించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న 4 మీటర్ల లాంగ్‌జంప్ అర్హత ప్రమాణాన్ని 3.8 మీటర్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. శాసనమండలి సమావేశాల్లో ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చిన ఆయన, వేలాది మంది అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం ముందుంచారు.
* అభ్యర్థుల తీవ్ర అవస్థలు
లాంగ్‌జంప్ లో 4 మీటర్ల అర్హత ప్రమాణం అనేక మంది అభ్యర్థులకు పెద్ద ప్రతిబంధకంగా మారిందని అన్నారు. అభ్యర్థులు రాత పరీక్షతో పాటు పరుగు పందెం, ఇతర ఫిజికల్ ఈవెంట్లలో సులభంగా అర్హత సాధిస్తున్నప్పటికీ, కేవలం లాంగ్‌జంప్‌లో కొన్ని సెంటీమీటర్ల తేడాతో అవకాశాన్ని కోల్పోతుండటం విచారకరమన్నారు.
* పొరుగు రాష్ట్రాల విధానం పరిశీలించాలి
లాంగ్‌జంప్ విషయంలో పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను బల్మూర్ వెంకట్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసు నియామకాల శారీరక సామర్థ్య పరీక్షల్లో లాంగ్‌జంప్ అర్హతను 3.8 మీటర్లుగానే పరిగణిస్తున్నారని గుర్తుచేశారు. అక్కడ 3.8 మీటర్లతో అవకాశం కల్పిస్తున్నప్పుడు, తెలంగాణలో 4 మీటర్ల కఠిన నిబంధన కొనసాగించడం వల్ల మన రాష్ట్ర అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు.
* సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి
ప్రస్తుతం భర్తీ జరుగుతున్న 7,437 పోస్టుల ప్రక్రియలోనే లాంగ్‌జంప్ నిబంధనను 3.8 మీటర్లకు తగ్గిస్తే పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఫిజికల్ టెస్టుల నాణ్యత తగ్గదని, అదే సమయంలో అభ్యర్థులకు మరింత న్యాయమైన అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని బల్మూర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
