Singareni Workers Housing
* ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తూ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్న సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశాలలో భాగంగా స్పీకర్ అనుమతితో విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లారు. గత ప్రభుత్వం సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలో తీవ్ర నిరాశకు గురిచేసిందని, ప్రస్తుత ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
* ఉపయోగం లేని భూముల్లో ‘పైలట్ ప్రాజెక్ట్’
సింగరేణి సంస్థ పరిధిలో ఎన్నో భూములు ఆక్రమణలకు గురై, అన్యాక్రాంతమవుతున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా, ఖాళీగా ఉన్న 4 నుంచి 10 ఎకరాల భూమిలో ఓ ‘పైలట్ ప్రాజెక్ట్’ చేపట్టాలని సూచించారు. ఆ భూముల్లోనే సింగరేణి కార్మికులు స్వయంగా ఇళ్లు కట్టుకునేలా వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు.
* జీవో 76 ద్వారా పట్టాల పంపిణీ..
తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, స్థలాలన్నీ సింగరేణి పరిధిలోనే ఉండటంతో నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కో మరియు సింగరేణి ప్రాంతాల్లో దాదాపు 50 సంవత్సరాలుగా చిన్న చిన్న గుడిసెలలోనే నివాసముంటున్న నిర్వాసితులకు 76 జీవో ప్రకారం క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో కొందరికి పట్టాలు ఇచ్చారని, ఆ తర్వాత మిగిలిపోయిన పేదలందరికీ తక్షణమే పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని అర్థించారు.
* మహిళలకు ‘సోలార్ ప్లాంట్లు’..
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల (SHG) అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్యే, సింగరేణి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ (OC) గనుల పైన ఉన్న ఖాళీ స్థలాలను ఇందుకు వినియోగించాలని కోరారు. ఆ ఖాళీ భూముల్లో స్థానిక మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే, వారికి ఆర్థిక సాయం లభించడమే కాకుండా పర్యావరణ రక్షణకు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి దోహదపడుతుందని అసెంబ్లీ వేదికగా విన్నవించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
