Revanth Reddy, Devendra Fadnavis
* రేపు దేవేంద్ర ఫడ్నవిస్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటి
* తుమ్మిడిహెట్టి. . నాలుగు మీటర్ల జల వివాదం!
* 152 మీటర్లకు – నో – చెప్పిన మహారాష్ట్ర
* మేడిగడ్డకు ఇదే ప్రత్యామ్నాయమా ..?
* గ్రావిటీతో నీటి తరలింపు తెలంగాణ లక్ష్యం
* గ్రావిటీ ద్వరా నీటి తరలింపు – విద్యుత్ భారం తగ్గే అవకాశం..
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్ , ప్రత్యేక కథనం :
సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబందించిన చర్చలు వీరి మద్య జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణుల బృందంతో పాటు సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి , మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగే చర్చలు విజయవంతం అయ్యే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు ఆశ పడుతున్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజీ ఎత్తుకు సంబందించిన అంశమే ఇప్పటి వరకు అడ్డంకిగా ఉంది. 152 మీటర్ల ఎత్తు లో బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం ఉండాలని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.. 152 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం అయితే మహారాష్ట్ర లో ముంపు సమస్య తీవ్రంగా పెరుగుతుందని మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఒప్పుకోవడం లేదు.. 148 మీటర్లయితే సరేనని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ఇపుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం మద్యే మార్గంగా 150 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం తో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది..

* అసలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంటే..?
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలో ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన బ్యారేజీ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి ఇదే ప్రారంభ జలసేకరణ ప్రాంతం .అసలు ప్రతిపాదన ప్రకారం ప్రాణహిత నుంచి నీటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించి, అక్కడి నుంచి వివిధ లింకుల ద్వారా తెలంగాణలోని పలు ప్రాంతాలకు అందించాలి. సాగు నీటి తోపాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర జల సంఘం 2010 వివరాల ప్రకారం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ ద్వారా మళ్లించాలని ప్రతిపాదించిన నీరు 160 టీఎంసీలు ( TMC ) 16.40 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ప్రాజెక్ట్ ద్వారా నీరందించాలని ప్రతిపాదించారు. తుమ్మిడిహెట్టి – ఎల్లంపల్లి మద్యలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదించారు. సాగు నీటి అవసరాలతో పాటు తాగు, పరిశ్రమల అవసరాల కోసం కూడా నీటిని అందించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
* ఏయే నదుల నుంచి నీరు వస్తుందంటే..?
తుమ్మిడిహెట్టికి ప్రధాన ఆధారం ప్రాణహిత నది. దాని ప్రవాహంలో మహారాష్ట్ర నుంచి వార్ధా, మద్య ప్రదేశ్ నుంచి వెయిన్‌గంగా, మహారాష్ట్ర నుంచి పెన్‌గంగా ఉప నదుల నీరు భాగమవుతుంది. పెన్‌గంగా ముందుగా వార్ధాలో కలుస్తుంది . వార్ధా -పెన్‌గంగా తదితర ఉపనదుల నీటితో వెయిన్గంగాను కలుస్తుంది. వెయిన్‌గంగా – వార్ధాతో కలిసిన తర్వాత రెండింటి ప్రవాహం ప్రాణహితగా కొనసాగుతుంది . ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాంతం నుంచి దిగువకు ప్రవహించి కాళేశ్వరం సమీపంలో గోదావరిలో కలుస్తుంది

* మహారాష్ట్ర అభ్యంతరం ఏంటి..?
తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే తమ భూభాగంలో ముంపు ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది . 152 మీటర్ల నీటిమట్టంతో బ్యారేజీ నిర్మిస్తే తమ రాష్ట్రంలో మొత్తం 1174 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. 1600 హెక్టార్ల భూములు మునుగుతాయన్న కారణంతో ఆ రాష్ట్రం 148 మీటర్లకు పరిమితం చేయాలని కోరింది. 2016 ఆగస్టు 23న జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్లకు అంగీకారం కుదిరినట్లు తెలంగాణ సాగునీటి శాఖ చెబుతోంది. వ్యవసాయ భూములతోపాటు అటవీ ప్రాంతాలు, చప్రాల వన్యప్రాణి అభయారణ్యంపై ప్రభావం ఉంటుందన్నది కూడా ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, ముంపు తగ్గించే చర్యలపై సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అపుడే ఆదేశించింది. కాగా పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ సీడబ్ల్యూపీఆర్ఎస్ (CWPRS) అధ్యయనం ప్రకారం 148–152 మీటర్ల మధ్య ముంపులో పెద్ద తేడా ఉండదని చెబుతోంది. ముంపుగా చూపే విస్తీర్ణంలో సుమారు సగం నదీ గర్భమేనని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన 148 మీటర్లు , ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న 152 మీటర్లు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సరి కొత్త ప్రతిపాదన చేశారు. అదీ 150 మీటర్ల ఎత్తులో తుమ్మడి హెట్టి ప్రాజెక్ట్ నిర్మిస్తే 413 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర వైపు ముంపు తగ్గే అవకాశం ఉందన్నదే సీఎం రేవంత్ రెడ్డి పాయింట్ అంటున్నారు. ఇదే పాయింట్ తో మహారాష్ట్ర సీఎం తో చర్చలు సఫలం అయ్యే విదంగా చూద్దామని ముందడుగు వేస్తున్నారు. ఈ ప్రతిపాదన తో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) దగ్గరకు రేపు సీఎం రేవంత్ రెడ్డి, సాగు నీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు అధికారుల బృందం వెళుతున్నారని తెలుస్తోంది.
* కాళేశ్వరంతో పోలిస్తే తుమ్మిడిహెట్టి వల్ల ప్రయోజనం ఏమిటి?
తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ (Tummidi Hatti Project) వల్ల నీటిని ఎత్తి పోసే తిప్పలు తప్పుతుందంటున్నారు. గ్రావిటీ ద్వారా నీటిని పొలాలకు మళ్ళించవచ్చని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి వైపు నీటిని ఎత్తిపోసే వ్యవస్థను రూపొందించారు. తుమ్మిడిహెట్టి నుంచి అనుకూలమైన నీటిమట్టం, కాలువ మార్గం ద్వారా తరలింపు వల్ల విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చన్నని చెబుతున్నారు. ప్రస్తుతం పరిశీలిస్తున్న మార్గాల్లో ఎల్లంపల్లికి అనుసంధానం, సుందిళ్లకు గ్రావిటీ మార్గం వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నట్లు తెలంగాణ సాగునీటి శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 71 కిలోమీటర్ల పాత కాలువ వ్యవస్థ, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పునర్వినియోగించే అవకాశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతే కాకుండా మరో 21 కిలో మీటర్ల మేర టన్నెల్ నిర్మించి సుందిల్ల బ్యారేజీకి చేర్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఏటా రూ. 384 కోట్లు విద్యుత్ బిల్లును ఆదా చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

——————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.

