Panchanama Web Series
* నిర్మాతగా ఉదయభాను
* ‘పంచనామా’పై భారీ అంచనాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: టెలివిజన్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. జీ5 కోసం ఆమె నిర్మాతగా, షో రన్నర్‌గా రూపొందించిన ‘పంచనామా’ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
* 15 ఏళ్ల కల.. ఇప్పుడు నిజమైంది
నిర్మాతగా మారాలనేది తనకు 15 ఏళ్లుగా ఉన్న కల అని ఉదయభాను తెలిపారు. టెలివిజన్ రంగంలోనే తన ప్రయాణం ప్రారంభమైనందున.. అక్కడి నుంచే ప్రొడక్షన్ జర్నీని మొదలుపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. మంచి కథలు, కాన్సెప్ట్స్‌తో పలువురిని కలిసినా ప్రాజెక్టులు చివరి దశలో ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
* జీ5తో ‘పంచనామా’కు శ్రీకారం
చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్ ద్వారా జీ హెడ్ అనురాధను కలిసినట్లు ఉదయభాను వెల్లడించారు. తన వద్ద ఉన్న కథలు, కాన్సెప్ట్స్ గురించి ఆమెకు వివరించగా.. వాటిలోని ఆలోచనలు నచ్చడంతో ‘పంచనామా’ ప్రాజెక్ట్‌కు అవకాశం లభించిందని చెప్పారు. ఈ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని, తన పిల్లల కోసం ఎంత కష్టపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే శ్రమించానని తెలిపారు.
* భరత్ శ్రీనివాసన్ వెంటనే ఓకే
దర్శకుడు మోహన్ శ్రీవత్స, రచయిత నాగేంద్రతో కలిసి భరత్ శ్రీనివాసన్‌కు కథ చెప్పగా వెంటనే ఆయనకు నచ్చిందని ఉదయభాను తెలిపారు. భరత్ డేట్లు లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్టార్డమ్ ఉన్నప్పటికీ సెట్లో ఆయన ఎంతో కంఫర్టబుల్‌గా పనిచేశారని ప్రశంసించారు.
* టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
తక్కువ సమయంలో మంచి క్వాలిటీతో సిరీస్‌ను పూర్తి చేసేందుకు చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ 100 శాతానికి మించి పనిచేశారని ఉదయభాను చెప్పారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స, కో-ప్రొడ్యూసర్ విజయేంద్ర మౌళి, నటీనటులు, టెక్నీషియన్లు, కాస్టింగ్ డైరెక్టర్ ధనరాజుకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
* ‘పంచనామా’పై భారీ నమ్మకం
తనలో 15 ఏళ్లుగా దాచుకున్న ఆవేదన, భావోద్వేగం ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాయని ఉదయభాను పేర్కొన్నారు. అందుకే ఈ సిరీస్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నానని చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘పంచనామా’ కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
ఆరు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రివ్యూ కార్యక్రమంలో భరత్ శ్రీనివాసన్, విజయేంద్ర మౌళి, మేధా రెడ్డి, సూర్య శ్రీనివాస్, శ్రీజ, శివ కార్తీక్ దండ, రచయిత నాగేంద్ర పిల్లా, చీఫ్ కో-డైరెక్టర్ బాలకృష్ణ కట్టా, కాస్ట్యూమ్ డిజైనర్ భావన పోలేపల్లి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
