CM Revanth Reddy , Hyderabad Ganesh Celebrations
* ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, మున్సిపల్, హైడ్రా, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
* ప్రత్యేక కంట్రోల్ రూమ్
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గణేశ్ మండపాల వివరాలు, ప్రముఖులు లేదా అతిథుల రాకకు సంబంధించిన సమాచారాన్ని నిర్వాహకులు ముందుగానే పోలీసులకు అందించాలని సీఎం సూచించారు. దీనివల్ల భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు.
* మండపాలకు ఉచిత విద్యుత్
తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
* చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు
అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేపట్టాలని సీఎం ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేందుకు చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన పాత సంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని సీఎం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
