CURE Master Plan Hyderabad
* అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని రాబోయే 20–30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ‘క్యూఆర్ (CURE–Core Urban Region) బిల్లు–2026’పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధిపై పలు కీలక అంశాలను వెల్లడించారు.
* 30 ఏళ్ల అవసరాలకు ‘క్యూఆర్ యాక్ట్’
70 ఏళ్ల క్రితం సుమారు 15 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన GHMC చట్టం ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని మంత్రి అన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌కు అనుగుణంగా వికేంద్రీకృత నగర పాలనను తీసుకువస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ నగరాలతో పోటీపడేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు నగర గత వైభవాన్ని కాపాడేందుకు ‘క్యూఆర్ యాక్ట్–2026’ ఉపయోగపడుతుందని వివరించారు.
క్యూఆర్ అపెక్స్ గవర్నింగ్ కౌన్సిల్ కేవలం విధాన నిర్ణయాలు, ప్రాధాన్యతలను నిర్దేశించే సలహా మండలిగా మాత్రమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేషన్లు, పోలీస్, మున్సిపల్, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖల అధికారాలను ఈ కౌన్సిల్ తీసుకోదని చెప్పారు. ఆయా శాఖల మధ్య సమన్వయానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
* బ్లూ, గ్రీన్ సిటీగా హైదరాబాద్
GHMC, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన ఆర్కిటెక్ట్‌లు, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. పెరుగుతున్న జనాభా తాగునీటి అవసరాల కోసం అదనంగా 2 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనంతో హైదరాబాద్‌ను బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో నగరవ్యాప్తంగా 5 వేల నుంచి 10 వేల వరకు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
* పాతబస్తీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
చార్మినార్ ప్రాంతాన్ని హైదరాబాద్‌లోని ప్రాచీన ఆర్థిక మండలిగా అభివర్ణించిన మంత్రి.. చార్మినార్ పెడస్ట్రియన్ ప్రాజెక్టును వేగవంతం చేస్తామని తెలిపారు. నయాపూల్ నుంచి లాడ్ బజార్ వరకు నైట్ బజార్ ఏర్పాటు, బ్యాటరీ వాహనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మలక్‌పేటలో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. పాతబస్తీ సీవరేజ్ పనుల కోసం చంద్రాయణగుట్టలో ₹500 కోట్లు, కార్వాన్లో ₹300 కోట్లు కేటాయించి పనులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
* ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఫైర్ స్టేషన్
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్ స్టేషన్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, స్మశానవాటికల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రక్షణ శాఖ భూముల క్రమబద్ధీకరణపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
* 2047 నాటికి ₹3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ
హైదరాబాద్‌ను తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అన్ని వైపులా సమానంగా అభివృద్ధి చేస్తామని శ్రీధర్ బాబు అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో హైదరాబాద్‌ను ప్రధాన గ్రోత్ ఇంజన్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
