CITU Public Sector Protection
* కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలి: సీఐటీయూ
ఆకేరు న్యూస్, వరంగల్: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేసి, వాటిని మరింత బలోపేతం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దాం’ అనే నినాదంతో వరంగల్లోని నోబుల్ ఫంక్షన్ హాల్లో జిల్లా సదస్సు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జూపల్లి సంపత్ రావు, సి. రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని అన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను తగ్గించి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంస్థలకు అవసరమైన నిధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.
సంస్థల భూములు, ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా కాపాడాలని, కార్మిక చట్టాలు, ఉద్యోగుల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడం అంటే కార్మికుల ఉద్యోగాలతో పాటు ప్రజల హక్కులు, దేశ ఆర్థిక స్వావలంబనను కాపాడటమేనని పేర్కొన్నారు. సీఐటీయూ చేపట్టే ప్రభుత్వ రంగ పరిరక్షణ ఉద్యమాలకు కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బుర్ర శివనివాస్ రెడ్డి, ఆంజనేయులు, రాజగోపాల్, శ్రీనివాస్, జన్ను ప్రకాశ్, బ్రహ్మచారి, ఎండీ బషీర్, జీవన్ కుమార్, ఎల్లయ్య, పుల్మాటి శివ, బిక్షపతి, ఎండీ మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
