Ponguleti Srinivasa Reddy, Dharani Land Issues
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో భూముల రికార్డుల నిర్వహణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి విధానం అనేక సమస్యలకు కారణమైందని రెవెన్యూ, భూసంస్కరణల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. భూమి రైతు కుటుంబానికి ఆస్తి మాత్రమే కాకుండా భవిష్యత్తుకు భరోసా, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో 22A నిబంధనలు, రెవెన్యూ సంస్కరణలు, ధరణి లోపాలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి చట్టాన్ని కొంతమంది వ్యక్తులు రహస్యంగా రూపొందించారని ఆరోపించారు. ధరణి నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థకు అప్పగించి, రాష్ట్రంలోని భూముల డేటా భద్రతపై కూడా అనుమానాలు కలిగేలా వ్యవహరించారని విమర్శించారు.
* 22A పేరుతో పేదలకు నష్టం
ధరణిలోని లోపాలను ఉపయోగించుకుని వేలాది ఎకరాల భూముల బదలాయింపులు జరిగాయని మంత్రి ఆరోపించారు. 22A నిబంధనల పేరుతో పేదల భూములకు ఇబ్బందులు కలిగించారని అన్నారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. VRO, VRA వ్యవస్థలను ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా రద్దు చేయడంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు.
* 5.46 లక్షల దరఖాస్తుల పరిష్కారం
2023 డిసెంబర్ 7 నాటికి ధరణిలో 2.46 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం మరో 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తం 5.46 లక్షల దరఖాస్తులను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, పారదర్శకమైన స్పీకింగ్ ఆర్డర్ల ద్వారా పరిష్కరించిందని వెల్లడించారు. ప్రజల ఆస్తుల హక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పొంగులేటి స్పష్టం చేశారు. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా తెలంగాణ ప్రజల భూములకు సంపూర్ణ చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
