BRICS Summit
* మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక భేటీలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా బిజీగా గడిపారు. మూడు రోజుల వ్యవధిలో వివిధ దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఏకంగా 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ, సాంకేతిక ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయా నేతలతో చర్చలు జరిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ కీలకంగా సమావేశమయ్యారు. పుతిన్‌తో భారత్-రష్యా సంబంధాలు, రక్షణ, ఇంధనం, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇరాన్ అధ్యక్షుడితో పశ్చిమాసియా పరిస్థితులు, శాంతి, సముద్ర రవాణా భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో సరిహద్దుల్లో శాంతి, పరస్పర గౌరవం, వాణిజ్యం, మార్కెట్ అవకాశాలు, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణపై చర్చ జరిగినట్లు సమాచారం.
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్‌తోనూ మోదీ సమావేశమై భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, సాంకేతికత, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచే అంశాలు చర్చకు వచ్చాయి.
ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌తో ఆర్థిక సహకారం, రక్షణ, భద్రత, సామర్థ్య నిర్మాణంపై చర్చించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌తో బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ, భద్రతా మండలి సంస్కరణలు, ఆహార భద్రత, పునరుత్పాదక ఇంధనం, మానవకేంద్రిత కృత్రిమ మేధస్సు వంటి అంశాలను మోదీ చర్చించారు.
మొత్తంగా బ్రిక్స్ సదస్సు వేదికగా మోదీ నిర్వహించిన వరుస భేటీలు భారత్ దౌత్య చురుకుదనాన్ని చాటాయి. వివిధ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాలు సాగాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
