Power cut to Kalwakurthy - Jagadees Reddy
* రైతుల కోసం ప్రాణాలైనా ఇస్తాం
* కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు
Power cut to Kalwakurthy : ఆకేరు న్యూస్,హైదరాబాద్ : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కరెంటు బిల్లులు చెల్లించలేదనే కారణంతో కల్వకుర్తి ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టు లిఫ్ట్‌ను ప్రారంభిస్తే.. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కరెంటు కట్ చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 24 గంటల పాటు డెడికేటెడ్ పవర్ సరఫరా చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా పూర్తి స్థాయిలో నాట్లు వేసుకోవాలని సూచించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
* నీళ్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం..
సాగునీటి కోసం రైతుల తరఫున ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలకు తెగించైనా నీళ్ల కోసం కొట్లాడుతామని అన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
* ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఆందోళన..
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం కేవలం 200 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నీటిని తెలంగాణ రైతుల అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించడం అక్రమమని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉలుకు లేదని, పలుకు లేదని విమర్శించారు. ఏపీ వైపు నుంచి మొత్తం గేట్లు ఎత్తి నీటిని తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
*వెలుగొండ నీటిపైనా ఆరోపణలు..
వెలుగొండ ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల నీటిని కూడా చంద్రబాబు వదలడం లేదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించిన జగదీష్ రెడ్డి.. రాష్ట్ర రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
