Notice to KTR PA
* KTR PA రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 7న అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఎమ్మెల్యేల ఆందోళనకు సంబంధించిన ఘటనలపై వీరిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేల ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. ఘటనకు సంబంధించిన వివరాలు, వారి పాత్రపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి, మహేష్‌కు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సైఫాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. దీంతో అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళన కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
