Khairatabad Bada Ganesh 2026
* 69 అడుగుల భారీ మట్టి విగ్రహానికి వైభవంగా తొలిపూజ..
* దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : భాగ్యనగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి 72వ వార్షికోత్సవంలో భాగంగా ఈ ఏడాది ‘శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.
*69 అడుగుల మట్టి గణపతి..
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈసారి మట్టి విగ్రహాన్ని రూపొందించారు. సుమారు 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భారీ గణనాథుడిని తీర్చిదిద్దారు. ఐదు ముఖాలు, ఆరు చేతులతో దర్శనమిస్తున్న మహాగణపతి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంకటాలను తొలగించే స్వామిగా ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ని ప్రత్యేకంగా అలంకరించారు.
వినాయక చవితి సందర్భంగా సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య తొలిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది. దీంతో ఖైరతాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
* రెండు నెలలు.. 150 మంది కళాకారుల శ్రమ..
భారీ గణపతి విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది నిపుణులైన కళాకారులు దాదాపు రెండు నెలలపాటు శ్రమించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ నిర్మాణంతో పాటు పరిసరాల్లో ఏర్పాటు చేసిన అలంకరణలు, పార్శ్వ విగ్రహాలు భక్తులను ఆకట్టుకునేలా రూపొందించారు.
* దర్శనానికి పోటెత్తిన భక్తులు..
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే గణనాథుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భారీ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో నిర్వాహకులు, పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తుండటంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నవరాత్రుల సందర్భంగా రోజురోజుకూ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈసారి మట్టి విగ్రహంతో పర్యావరణహిత సందేశాన్ని చాటుతూ.. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో కొలువుదీరిన ఖైరతాబాద్ బడా గణేశుడు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
