Nagole Rowdy-Sheeter Murder
* స్నేహితుడే హంతకుడా? * లైవ్‌గా రికార్డైన హతవీడియో కలకలం.. * పాత కక్షలే కారణమా? * నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : నగరంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన మహమ్మద్ నహీమ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డైనట్లు సమాచారం.
* చిన్ననాటి స్నేహితులే.. చివరకు శత్రువులుగా..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా తెలుస్తోంది. అయితే కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
*సెటిల్మెంట్ డబ్బుల వ్యవహారమే కారణమా?..
ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
*ఇద్దరిపైనా రౌడీషీట్లు..
మహేష్, నహీమ్లపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఇద్దరిపైనా రౌడీషీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య ఉన్న పాత వివాదాలు, క్రిమినల్ నేపథ్యం, ఇటీవలి గొడవలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
*నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు..
హత్య ఘటనపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధించిన వీడియో, సీసీ కెమెరా దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని పరిశీలిస్తున్నారు.
మహేష్‌తో పాటు అతని బృందం కోసం నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన వివాదం చివరకు హత్యకు దారితీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
