Telangana Praja Palana Dinotsavam,
* ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ
* ఘనంగాప్రజాపాలన దినోత్సవ వేడుకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని చేరవేయడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఒక ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
* ప్రజాపాలనకు పునాదులు ఇవే..
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన చారిత్రక యోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం తమ ప్రజా పాలనకు పునాదులని స్పష్టం చేశారు. రైతుకు భరోసా, మహిళలకు ఆర్థిక స్వతంత్రం, అట్టడుగు వర్గాలకు న్యాయం, పేద బిడ్డకు నాణ్యమైన విద్య-వైద్యం, యువతకు ప్రపంచంతో పోటీపడే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
* ప్రజాస్వామ్య మార్గం..
తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని ముఖ్యమంత్రి కొనియాడారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం కావడంతోనే దీనిని ‘ప్రజా పాలన దినోత్సవం’గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, వనరులు అందరికీ అందేలా చూడడమని పేర్కొన్నారు.
* అభివృద్ధి.. సంక్షేమ పథకాలు..
తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతో పోటీ పడుతోందని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికమని సీఎం వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం రూ. 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ కింద రూ. 20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల కుటుంబాలను ఆదుకున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లకు పైగా జమ చేశామని, సన్న వరికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందించామన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ. 12,385 కోట్ల ఆడబిడ్డల ఖర్చు ఆదా అయిందని తెలిపారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు.
*సామాజిక న్యాయం, విద్య, వైద్య రంగాలు
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించామని సీఎం గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లుగా భావించి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు.
*భవిష్యత్ ప్రణాళికలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా నిర్మిస్తున్నామని, ఇందులో టీసీఎస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరి సహకారంతో సంక్షేమ, అభివృద్ధి ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
