Telangana MLC Elections 2027
* పాత ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోవాలి
Telangana MLC Elections 2027: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. 2027 మార్చి నాటికి పదవీకాలం ముగియనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) కార్యాలయం ప్రారంభించింది.
రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ముందస్తుగా ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ చేపడుతున్నారు.
ముఖ్యమైన తేదీలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సంబంధించి షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు.
ఓటర్ల నమోదు నోటిఫికేషన్: సెప్టెంబర్ 28
ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 6 వరకు
ముసాయిదా ఓటర్ల జాబితా: నవంబర్ 25
క్లెయిమ్స్, అభ్యంతరాలు: నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు
అనంతరం తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు.
పాత ఓటర్లకు కీలక సూచన
గత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా ఈసారి మళ్లీ ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత ఓటర్ల జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఈసారి ఓటు హక్కు కొనసాగదని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టి సారిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు తమ మద్దతుదారులు, అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
