Vaishnavi Murder Case
* భర్తను నడిరోడ్డుపై నరికేశాడు!
* సెల్ఫీ వీడియోతో సంచలనం
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : తెలంగాణలోని నిజామాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనలో, యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిత్తరి హరిబాబు (26) నడిరోడ్డుపై కిరాతక హత్యకు గురయ్యాడు. నిజామాబాద్‌లోని ఆర్ఆర్ (Rajarajendra) చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
* సంఘటన పూర్తి వివరాలు..
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యూట్యూబర్ వైష్ణవి (20), హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది మార్చి 17న వైష్ణవి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించి, గర్భిణీ అయిన వైష్ణవిని హరిబాబే గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఈ కేసులో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించిన హరిబాబు, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రాణ భయంతో అతను తన తల్లితో కలిసి నిజామాబాద్‌కు మకాం మార్చాడు.
* నడిరోడ్డుపై వెంటాడి హత్య
గురువారం సాయంత్రం నిజామాబాద్‌లోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఉన్న ప్రాంతంలో హరిబాబు ఉండగా, ఒక కారులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతనిపైకి దూసుకొచ్చారు. కొబ్బరిబొండాలు నరికే కత్తులతో తల, మెడపై విచక్షణారహితంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. కేవలం పది సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
* వైష్ణవి సోదరుడి సంచలన వీడియో..
ఈ హత్య జరిగిన కొద్దిసేపటికే వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేయడం కలకలం రేపింది. “నా చెల్లెలిని ఎవరికీ జరగకూడని విధంగా చంపేశాడు, అందుకే హరిబాబును నేనే హతమార్చాను. మా కుటుంబంలో జరిగిన క్షోభ ఏ ఇంట్లోనూ జరగకూడదు” అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం సంతోష్ కోరుట్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
* పోలీసుల దర్యాప్తు..
సంతోష్ లొంగుబాటు, చెల్లెలి మరణానికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఈ హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైనదేనా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read :

Please tell us what is wrong. Your report will be sent to the website team.
