Surakshit District Hanamkonda
* హెచ్ఐవీ, టీబీపై అవగాహన ర్యాలీ
ఆకేరు న్యూస్, హనుమకొండ :హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ, లైంగిక వ్యాధులు (STI), రక్తదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ హనుమకొండ జిల్లాను ‘సురక్షిత్ జిల్లా’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు.
హెచ్ఐవీ, టీబీ, STI, రక్తదానంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హనుమకొండ ఐడీఓసీ నుంచి నిట్ హనుమకొండ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎయిడ్స్, లైంగిక వ్యాధులపై ముఖ్యంగా యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఐవీ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలతో పాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ, STIలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్ఐవీ లేదా టీబీ ఉన్న వారిని వీలైనంత త్వరగా గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు పోషకాహార కిట్లు అందజేయాలని సూచించారు. రక్తదానంపై కూడా ప్రజల్లో అవగాహన పెంచి స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కోరారు.
* గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి..
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో వైద్యుల సూచన మేరకు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. హెచ్ఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం 1097 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని వెల్లడించారు.
హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తులకు టీబీ వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు రక్తం పడటం, అలసట, బరువు తగ్గడం, నీరసం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, పరీక్షలు మరియు చికిత్సపై అవగాహన పెంచేందుకు ఆరోగ్యశాఖ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి. మదన్మోహన్రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాధవరెడ్డి, నెహ్రూ నాయక్, హెచ్‌ఈఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, దేవిసింగ్, సువార్త, సబ్యూనిట్ ఆఫీసర్ విప్లవ్‌కుమార్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు, సిస్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది, డీపీఎం (DAPCU) మాధురి, కమలాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మారి వరంగల్, మారి భూపాలపల్లి, S.Y.O, RDMM, WARD, MIPRE, NPS స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీవీ ఆస్పత్రి కౌన్సిలర్ రాపర్తి సురేష్, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
