Congress MPs Siddipet Tour
* సీఎం తో భేటీ తర్వాతే స్పష్టత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల సిద్దిపేట పర్యటనపై ప్రస్తుతం తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనకు వెళ్తారా లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిద్దిపేటకి వెళ్తామంటూ కొందరు కాంగ్రెస్ ఎంపీలు ప్రకటిస్తుండగా, తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. ఎంపీల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది.
నిన్న రాత్రి ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హడావుడిగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట పర్యటనపై ఎంపీల్లో సందిగ్ధత ఏర్పడింది.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని భేటీ కానున్నారు. సీఎం తో సమావేశం ముగిసిన తర్వాతే సిద్దిపేట పర్యటన ఉంటుందా లేదా అనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు అసెంబ్లీ వద్ద మాత్రం పర్యటన కోసం బస్సులు సిద్ధంగా ఉంచారు.
మొదటగా అనుకున్నట్టుగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంలో, సిద్దిపేట్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ అధికారులతో ఎంపీలు సమావేశం కావాలని భావించారు. అయితే, దీనిపై అటు గాంధీ భవన్ నుంచి గానీ, సీఎల్పీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొంతమంది ఎంపీలు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ కార్యక్రమం సిద్ధం కాగా, అసెంబ్లీకి చేరుకున్న ఎనిమిది మంది ఎంపీలలో చాలా మందికి దీనిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది.
సీఎం తో సమావేశం అయిన తరువాత ఎంపీలు పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటికప్పుడు వెళ్లాలని నిర్ణయిస్తే మాత్రం, ఇప్పటికే సిద్ధంగా ఉంచిన బస్సుల్లో బయలుదేరే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
