* పూర్తి మద్దతు ప్రకటించిన జోబైడెన్
* పార్టీ కోసం, దేశం కోసం తప్పుకుంటున్నట్లు వెల్లడి
* ట్రంప్‌ను ఓడించే సమయం వచ్చిందని లేఖ
* బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపిన హారిస్
ఆకేరు న్యూస్ డెస్క్ : జోబైడెన్ (Joe Biden) తప్పుకోవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలాహారీస్ (Kamala Haris) వచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి (US presidential candidate) గా కమలా హారీస్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ బైడెన్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. దీంతో అమెరికా ఎన్నికలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, గత రాత్రి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాట్ పార్టీ (Democrat Party) అభ్యర్థి జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడమే కాదు తన నిర్ణయం తన రాజకీయ పార్టీకి, దేశానికి మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు అధ్యక్ష పదవికి డెమోక్రాట్ వైపు నుంచి ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ (Vice President of America) కమలా హారిస్ (Kamala Harris) అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు కూడా ఇచ్చారు.
నవంబర్ 5న అమెరికా (America) లో జరగనున్న ఓటింగ్ కు నాలుగు నెలల ముందే 81 ఏండ్ల జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. జూన్ చివరిలో తన రిపబ్లిక్ ప్రత్యర్థి (Republic Candidate), దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Former President Donald Trump) తో జరిగిన చర్చలో అతని పేలవమైన ప్రదర్శన ఇవ్వడం, అనారోగ్య కారణాలతో బైడెన్ పోటీ నుంచి వైదొలగాలని డెమోక్రాటిక్ పార్టీ నాయకులు గత కొన్ని వారాలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2025లో జోబైడెన్ అధ్యక్ష పదవీకాలం ముగుస్తుంది. అప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్, కమాండర్ ఇన్ చీఫ్ (Commander in Chief) గా కొనసాగుతానని బైడెన్ ట్విట్టర్ పోస్టు (Twitter post) ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవం అని జో బిడెన్ లేఖ విడుదల చేశారు. నా పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా నేను తప్పుకుని, నా మిగిలిన పదవీకాలం వరకు అధ్యక్షుడిగా నా బాధ్యతలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తానని నేను నమ్ముతున్నాను. ఈ వారంలో నా నిర్ణయం గురించి మరింత వివరంగా దేశంతో మాట్లాడతాను. 2020లో పార్టీ అభ్యర్థిగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం…ఇది నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ఈ సంవత్సరం కమలని మా పార్టీ అభ్యర్థిగా చేసినందుకు ఈ రోజు నేను ఆమెకు నా పూర్తి మద్దతు అందించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం వచ్చింది అంటూ లేఖలో పేర్కొన్నారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ మద్దతు తెలపడంపై కమలాహారిస్ కృతజ్ఞతలు తెలిపారు.
———————–