Starbucks GCC
* తొలి దశలో 800 టెక్ ఉద్యోగాలు
Starbucks GCC: ఆకేరు న్యూస్, చెన్నై: అమెరికాకు చెందిన ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్ చెన్నైలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వంతో సోమవారం (సెప్టెంబర్ 21, 2026) అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ కేంద్రం తొలి దశలో సుమారు 800 టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సమక్షంలో స్టార్‌బక్స్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు మధ్య ఈ ఒప్పందం జరిగింది. చెన్నైలో ఏర్పాటు కానున్న ఈ GCC భారత్‌లో స్టార్‌బక్స్‌కు తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కానుంది. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి నిర్వహిస్తున్న స్టార్‌బక్స్ రిటైల్ వ్యాపారానికి స్వతంత్రంగా పనిచేయనుంది.
చెన్నైకే ఎందుకు?
చెన్నైలో విస్తృతమైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, ఉద్యోగుల మెరుగైన నిలకడ, బలమైన మౌలిక వసతులు, ఇంజినీరింగ్ టాలెంట్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు GCC ఏర్పాటుకు కీలక కారణాలని స్టార్‌బక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ తెలిపారు. ఈ కేంద్రం స్టార్‌బక్స్ గ్లోబల్ బిజినెస్, టెక్నాలజీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వనుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ టెక్నాలజీ, బిజినెస్ టీమ్‌లతో కలిసి పనిచేయనుంది. అలాగే ప్రస్తుతం థర్డ్‌పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న కొన్ని కార్యకలాపాలను దశలవారీగా సంస్థలోకి తీసుకురావాలని స్టార్‌బక్స్ భావిస్తోంది.
2027లో నియామకాలు
స్టార్‌బక్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. స్థానిక నియామకాలు, కార్యాలయ ఏర్పాట్లపై రాబోయే నెలల్లో ప్రణాళిక రూపొందించనున్నారు. 2027 తొలి త్రైమాసికంలో నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చెన్నైలో స్టార్‌బక్స్ GCC ఏర్పాటుతో టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఇతర గ్లోబల్ బిజినెస్ కార్యకలాపాల్లో నైపుణ్యం ఉన్న యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రం ద్వారా చెన్నై గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
