Warangal Super Specialty Hospital
* గ్రీన్ చానల్ లో నిధులు విడుదల చేస్తున్నా కదా ..!
* అధికారులు నిర్లక్ష్యం వీడాలి
* సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
అకేరు న్యూస్, హైదరాబాద్ :వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా కొనసాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.
ఇకపై పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు నిర్మాణ పనులు కొనసాగించి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు రోడ్లు, భవనాలు, మున్సిపల్ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* సీఎం సూచనలు..
ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులకు స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించి, దానికి అనుగుణంగా ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షిస్తూ ముందుకు సాగాలని ఆదేశించారు.
ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించాలని చెప్పారు. ఆసుపత్రి పనులను ఇకపై ప్రతిరోజూ పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
భవన నిర్మాణంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, పనుల్లో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.
ఆసుపత్రి పరిసరాలను రోగులు, వారి సహాయకులకు అనుకూలంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ తరహాలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలోపు అవసరమైన సేవలను దశలవారీగా ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఇకపై జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు–భవనాలు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
