Rayaparthy MPDO Pakka Srinivas
* ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలి..
* విద్యార్థులకు ఎంపీడీవో పిలుపు
ఆకేరు న్యూస్, రాయపర్తి : పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన సమాజ నిర్మాణం మనందరి సామాజిక బాధ్యతని, ‘ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు – 2026’ పై సమాజంలో ప్రతీ ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఘన వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో పాక శ్రీనివాస్ మాట్లాడుతూ… ఇళ్ల వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించడం వంటి అంశాలలో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. సమాజంలో పారిశుద్ధ్య మార్పుకు విద్యార్థులే అసలైన రాయబారులని ఆయన కొనియాడారు.
* విద్యార్థుల్లో చైతన్యం నింపాలి..
రాబోయే సెలవుల సమయంలో విద్యార్థులు ఊరుకు వెళ్లినప్పుడు తమ ఇళ్లలోనే కాకుండా, గ్రామంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఘన వ్యర్థాల నియమాలు – 2026 ప్రాధాన్యతను వివరించాలని ఎంపీడీవో కోరారు. ప్రతి ఒక్కరూ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, సరైన పద్ధతిలో వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందించేలా చైతన్యపరచాలన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పాఠశాల ప్రిన్సిపాల్, సరిత, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్, గ్రామపంచాయతీ కార్యదర్శి యాకూబ్ నాయక్, ఉపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
