Naini Rajender Reddy
* మామునూరు ఎయిర్‌పోర్టు
* డ్రైనేజీ, రింగ్‌రోడ్‌పై ఫోకస్
ఆకేరు న్యూస్, హనుమకొండ: వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ డీసీసీ భవన్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
* ప్రతి పనికి కాలపరిమితి
వరంగల్ అభివృద్ధిపై సోమవారం రాత్రి వరకు సమీక్ష నిర్వహించామని నాయిని తెలిపారు. ప్రతి పనికి నిర్దిష్ట గడువు నిర్ణయించినట్లు చెప్పారు. మామునూరు విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్‌రోడ్, ఆసుపత్రులు, ఫిల్టర్‌బెడ్, దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
* మామునూరు ఎయిర్‌పోర్టుపై ఫోకస్
మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లు విడుదల చేసిందని నాయిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూర్చే బాధ్యతను చేపట్టినందున విమానాశ్రయ నిర్మాణంలో కేంద్రం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఎయిర్ కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ వంటి సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాల్లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని కోరినట్లు చెప్పారు.
* రూ.550 కోట్ల ఫిల్టర్‌బెడ్
ఒడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సుమారు రూ.550 కోట్ల ప్రాజెక్టును తీసుకొచ్చామని నాయిని తెలిపారు. టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రానున్న 30 నుంచి 40 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
* అభివృద్ధిపై చర్చకు సిద్ధం
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వరంగల్ అభివృద్ధిపై విమర్శలు చేయడం కంటే గతంలో జరిగిన పనుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నాయిని అన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులపై పూర్తి ప్రగతి నివేదికను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరంగల్‌ను రాష్ట్రంలో కీలక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
