Restaurants Food Safety
* కిచెన్లలో షాకింగ్ దృశ్యాలు..
* అక్కడ ఉండేది సరైన మాంసామేనా?
* వెలుగులోకి వస్తున్న అంశాలతో అనుమానాలు
* అధికారుల దాడుల్లో దిగ్భ్రాంతికర అంశాలు
* పాడైన మాంసం.. అపరిశుభ్ర వాతావరణం..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : చూసేందుకు ఇంపుగా.. నోట్లో పెట్టుకుంటే రుచిగా ఉండే పదార్థాల్లో కుళ్లినవి ఉంటాయంటే నమ్ముతారా? లొట్టలేసుకుని తింటున్న హోటళ్ల కిచెన్లలోకి తొంగిచూస్తే.. కుళ్లిన మాంసం, కళ్ళ ముందే తిరిగే బొద్దింకలు, కడుపులో వికారం పుట్టించే అపరిశుభ్రత ఉంటుందని తెలుసా? ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న మెరుపుదాడుల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూస్తున్నాయి.
* ప్రముఖ ఆహారవిక్రయ కేంద్రాల్లో
నగరంలో ప్రజల ఆరోగ్యామే లక్ష్యంగా తెలంగాణ ఆహార, అత్యవసర ఔషధాల ప్రమాణాల సంస్థ (టీజీ సేఫ్) ఎన్ఫోర్స్మెంట్ విభాగం దూకుడు పెంచింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫుడ్‌స్టాల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లపై ఉక్కుపాదం మోపుతోంది.
ఇందులో భాగంగా రంగంలోకి దిగిన 10 ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బంజారాహిల్స్, లక్డికాపూల్, కూకట్పల్లి వంటి రద్దీ ప్రాంతాల్లోని ప్రముఖ 21 ఆహార విక్రయ కేంద్రాలపై ఇటీవల ఏకకాలంలో దాడులు చేసి అక్రమాలను వెలికితీశారు.
* వెలుగులోకి దిగ్భ్రాంతికర అంశాలు..
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అధికారులు ఆయా హోటళ్ల కిచెన్లలో పరిశీలించగా దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. కల్తీ, అపరిశుభ్రత రాజ్యమేలుతున్న తీరు అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రధానంగా కింది లోపాలు వెలుగులోకి వచ్చాయి.
* పాడైన, నిల్వ మాంసాన్ని వినియోగదారులకు వడ్డించడానికి ఫ్రిజ్ లో ఉంచినట్లు గుర్తించారు.
* ఆహార పదార్థాలపై బొద్దింకలు, ఈగలు సంచరించడం మరియు వంట గదుల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉన్నట్లు గుర్తించారు.
* అంతేకాదు.. కిచెన్లు స్టోరేజ్ రూమ్‌లలో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని తెలిపారు.
* శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేస్తూ వాటి మధ్య సరైన విభజన పాటించకపోవడం.
* రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన గడువు ముగిసిన (Expired) సాస్‌లు, పాలు, ఇతర ఆహార దినుసులు.
* వంట చేసేవారు, వడ్డించేవారు కనీస గ్లౌవ్స్, క్యాప్స్ ధరించకుండా నిబంధనలను ఉల్లంఘించడం.
* నోటీసులు జారీ..
కల్తీ జరిగినట్లు బలమైన అనుమానాలున్న 13 చోట్ల ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన సిస్టర్స్ రెస్టారెంట్, మొమెంటలే హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
బంజారాహిల్స్, లక్డికాపూల్, కూకట్పల్లి, అమీర్‌పేటలోని ప్రముఖ హోటళ్లు, స్వీట్స్ దుకాణాలకు అధికారులు నోటీసులు అందజేశారు. గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాలని అధికారులు హెచ్చరించారు. హెచ్చరించిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసేందుకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
* ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నారా.?
ఏదో సందర్భంలో హోటల్ లో అపరిశుభ్ర వాతావరణం లేదా ఆర్డర్ చేసిన ఫుడ్ బాగోలేని సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటావి. అలాంటప్పుడు మీరు చూసిన అపరిశుభ్రతకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను తీసి, సంబంధిత హోటల్ పేరు, ప్రాంతం వివరాలతో @TaskForce_Food లేదా అధికారిక అధికారుల హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయవచ్చు.
అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లేదా ఫుడ్ సేఫ్టీ టెర్రరిజం/కల్తీ ఫిర్యాదుల వాట్సాప్ నంబర్: 93199 77777 (టెలికాం/ఫోటో-వీడియో ఆధారాలతో నేరుగా మెసేజ్ చేయవచ్చు). టెలిఫోన్ లేదా ఈమెయిల్: ఆహార భద్రత అధికారులకు నేరుగా ఫోన్ ద్వారా లేదా వారి అధికారిక ఈమెయిల్ ఐడీ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
