Ganesh Immersion in Greater Warangal
* 17 చెరువుల్లో 30 క్రేన్ల ఏర్పాటు..
* రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు
*అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ
ఆకేరు న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.
బుధవారం వరంగల్ జిల్లా పరిధిలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కుడా చైర్పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి ఆమె వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ బల్దియా పరిధిలోని 17 చెరువుల్లో నిమజ్జనానికి 30 క్రేన్లను ఏర్పాటు చేసి, మొత్తం రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, మత్స్య, మైనింగ్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, బల్దియా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.
నిమజ్జన కార్యక్రమాలకు నగరం మొత్తం శోభాయమానంగా ముస్తాబైందని, గురువారం సాయంత్రం వరకు సుమారు 8 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, క్రేన్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మట్టి విగ్రహాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా చెరువుల కాలుష్యాన్ని నివారించవచ్చని ప్రజలకు సూచించారు.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయంలో అధికారులు, పోలీస్ సిబ్బంది సూచనలను పాటిస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
నిమజ్జనం అనంతరం చెరువుల్లో మిగిలే విగ్రహాల అవశేషాలను తొలగించడం బల్దియాకు కీలక బాధ్యతగా పేర్కొంటూ, వాటిని పూర్తిస్థాయిలో తొలగించి చెరువులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అవసరమైన చెరువుల్లో పూడికతీత, శుభ్రత కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
నీటి నిల్వ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నగరవ్యాప్తంగా 145 మంది గజ ఈతగాళ్లతో పాటు డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.
* జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన చెరువుల వద్ద అన్ని శాఖల సమన్వయంతో బల్దియా ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలు గురువారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
*జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ* వినాయక నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లను వెచ్చించి, 17 చెరువుల్లో 30 క్రేన్లతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను అందుబాటులో ఉంచి, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విగ్రహాల నిమజ్జనం పూర్తయిన వెంటనే చెరువుల పరిసరాలను శుభ్రం చేసి, విగ్రహాల అవశేషాలను సకాలంలో తొలగించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
భక్తులు అధికారులకు సహకరించి నిర్దేశించిన నిమజ్జన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనంq చేయాలని, చెరువుల్లోకి దిగకుండా భద్రతా సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ వెంకన్న కోరారు. ప్రజలు, భక్తులు, గణేష్ ఉత్సవ నిర్వాహకుల సహకారంతో నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వరంగల్ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అదనపు కమిషనర్ జోనా, బల్దియా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఆర్డీవో సుమ జీడబ్ల్యూఎంసీ, కుడా, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, మత్స్య, మైనింగ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
