Balapur Ganesh
* స్వామివారికి ప్రత్యేక పూజలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బాలాపూర్ మహాగణపతిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పి. కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం, మండప అర్చకులు కేటీఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనానంతరం ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి.. కేటీఆర్‌ను శాలువాతో సత్కరించి, బాలాపూర్ ప్రసిద్ధ లడ్డూను ప్రసాదంగా అందజేశారు.
శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలని..
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రజలంతా తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన, తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. వినాయకుడి ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగిపోయి, కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. కేటీఆర్ రాకతో బాలాపూర్ ప్రాంతం బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల రాకతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కళ్లెం ఎల్లారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
