CM Revanth Reddy Thermal Power Plant
* బొగ్గు కొనుగోలుకు ఆదేశం
* దసరాలోపు పూర్తి ఉత్పత్తి
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు జీ9 గ్రేడ్ బొగ్గు అవసరమని అధికారులు సీఎంకు వివరించారు. అయితే సింగరేణిలో ప్రస్తుతం జీ9 గ్రేడ్ బొగ్గు బ్లాకులు లేవని అధికారులు వెల్లడించారు. జీ9 బొగ్గు అందుబాటులో లేనప్పుడు ప్లాంట్‌ను ఎలా నిర్మించారని సీఎం ప్రశ్నించారు. అలాగే పిట్హెడ్కు దూరంగా యాదాద్రి ప్లాంట్‌ను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.
ప్లాంట్‌కు దూర ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా చేయడం వల్ల సుమారు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అధికారులు వివరించారు. రాజకీయ కారణాలతోనే ప్లాంట్‌ను పిట్హెడ్కు దూరంగా నిర్మించారనే అంశం కూడా సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో సింగరేణి నుంచి అవసరమైన జీ9 బొగ్గును సరఫరా చేయలేకపోయామని అధికారులు తెలిపారు. సింగరేణిలో 14 బొగ్గు బ్లాకులు మూతపడినట్లు కూడా వెల్లడించారు.
యాదాద్రి ప్లాంట్‌కు అవసరమైన జీ9 బొగ్గు లభ్యతపై సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆరా తీశారు. మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో వెంటనే చర్చించాలని డిప్యూటీ సీఎం భట్టికి సీఎం సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
