Maha Ganapathi at Khairatabad
* తొలగిన వివాదం.. ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు
* ఆపరేషన్ మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహా నిమజ్జన పర్వానికి మహానగరం సిద్ధమైంది. 12 రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుడి వీడ్కోలు మహోత్సవానికి రాజధాని సర్వసన్నద్ధమైంది. మొదటిసారిగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని ట్రై-కార్పొరేషన్లు ఉమ్మడిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం విశేషం. అన్ని విభాగాలు కలిసికట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశాయి. పలు దఫాలు సమీక్షలు, పరిశీలనల అనంతరం ఆటంకాలు లేని నిమజ్జన వేడుకకు చర్యలు చేపట్టాయి.
* ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు
ఇప్పటి వరకు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం లేదంటూ నిషేధాజ్క్షలు ఉన్నాయి. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనలు చేపట్టాయి. పరిస్థితి తీవ్రతను గ్రహించిన పాలనా యంత్రాంగం వెనక్కి తగ్గి, తక్షణమే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచే అక్కడ నిమజ్జనాలు ప్రారంభమవ్వగా, మొత్తం 15 భారీ క్రేన్లను అందుబాటులోకి తెచ్చారు. హుస్సేన్‌సాగర్‌పై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు వ్యూహాత్మక ప్లాన్‌ను అమలు చేస్తున్నారు:
* మొత్తం 140 కేంద్రాల పరిధిలో
క్యూర్ పరిధిలో మొత్తం 140 కేంద్రాల పరిధిలో 373 మొబైల్, స్టాటిక్ క్రేన్లను రంగంలోకి దించారు. ఇప్పటివరకు దాదాపు 1.50 లక్షల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. 5 అడుగుల లోపు విగ్రహాలను సమీపంలోని కృత్రిమ కొలనులలో, అంతకంటే పెద్ద విగ్రహాలను మాత్రమే ప్రధాన చెరువులు, హుస్సేన్‌సాగర్‌కు తరలించేలా నిబంధనలు విధించారు.
* శుక్రవారం మధ్యాహ్నం లోపే..
మహా నిమజ్జనం అంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. భారీకాయుడి శోభాయాత్ర ఆటంకాలు లేకుండా సాగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. “ఆపరేషన్ ఖైరతాబాద్” ప్రణాళికతో మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. అలాగే 19 కి.మీల ప్రధాన శోభాయాత్ర మార్గంలో సాయంత్రానికల్లా బాలాపూర్ గణనాథుడు ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా ట్రాఫిక్, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
* 20వేల మందితో భద్రత
మహా నిమజ్జన పర్వం సజావుగా సాగేందుకు ఏకంగా 20,000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తులో ఉంచుతున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా పోలీస్, వాటర్ బోర్డ్, టీజీఎస్పీడీసీఎల్, వైద్య విభాగాలు సమన్వయం చేసుకుంటుండగా.. ప్రమాద నివారణకు గజ ఈతగాళ్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. అలాగే శోభాయాత్ర సాగే ప్రధాన రహదారులలో పారిశుధ్యం క్షీణించకుండా 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో 2,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
