Musi Project Flood
* ప్రజలకు అత్యవసర హెచ్చరిక
* ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మండలాల ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు.
* రిజర్వాయర్ నీటిమట్టం వివరాలు..
ప్రస్తుతం మూసీ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 645.00 అడుగులకు కాను, ప్రస్తుతం 640.58 అడుగులుగా నమోదైంది. అలాగే రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్ట్‌లోకి 1150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, రానున్న రోజుల్లో ఈ ప్రవాహం మరింత హెచ్చయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
* ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం..
వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుండటంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఏ క్షణమైనా రిజర్వాయర్ గేట్లను ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల విభాగం (సూర్యాపేట డివిజన్-1) వెల్లడించింది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి లేదా చేపల వెళ్లేందుకు ఎవరు కూడా వెళ్లవద్దని హెచ్చరించారు.
* ప్రభావిత ప్రాంతాలు ఇవే..
మూసీ గేట్లు ఎత్తితే దిగువన ఉండే సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాల్లోని పలు గ్రామాలు, మండలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట, పెన్‌పహాడ్, పాలకీడు మండలాలతో పాటు రత్నాపురం, రామవరం, హనుమాన్ తండా, వెంకట్రాంపూర్ టేకుమట్ల, నంద్యాలగూడెం, కొంకతిమ్మని అన్నారం, సర్కిల్‌పేట, కాసరాబాద్, అనాజిపురం, అనంతారం, దోసపహాడ్, సజ్జాపురం, గంటవారిగూడెం, ఎల్లారం, సోమవరం, చింతకుంట్ల, పులగంబండ తండా, సింగారం, ఎల్లాపురం, శూన్యపహాడ్ గ్రామాలకు హెచ్చరిక జారీ చేశారు.
నల్గొండ జిల్లా: కేతేపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాలతో పాటు బొప్పారం, కాసనాగోడ్, చికటిగూడెం, కొత్తపేట, ఉప్పలపహాడ్, కొప్పోలు, భీమారం, ఆమనగల్, లక్ష్మీదేవిగూడెం, రావులపెంట, రాజాపేట, నర్సింహులగూడెం, తక్కెళ్లపాడు, కాల్వపల్లి, ఆళ్లగడప, రాయనిపాలెం, ములకల కాల్వ, కేశవాపురం, తుంటుకుంటవిల్ల, వాడపల్లి, వజీరాబాద్ గ్రామ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను పాటిస్తూ, ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలని నీటిపారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
