Meerpet Travel Bus Fire
* ఉలిక్కిపడిన ప్రయాణికులు
* డ్రైవర్ సమయస్ఫూర్తి.. తప్పిన పెను ప్రమాదం
* గణేష్ నిమజ్జనం కోసం వెళ్తుండగా దుర్ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ శివారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు ట్రావెల్ బస్సు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. శ్రీశైలం పర్యటనకు బయలుదేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అర్ధరాత్రి అకస్మాత్తుగా అగ్నికీలలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమయస్ఫూర్తితో డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
* గణేష్ నిమజ్జనం కోసం వెళ్తుండగా ప్రమాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్‌కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది ఉద్యోగులు, ప్రతినిధులు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రీ నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోయిస్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన TS 15 T 8558 నంబర్ గల ‘శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్’ బస్సు కుడివైపు ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
* డ్రైవర్ సమయస్ఫూర్తి
ఇంజిన్ నుంచి పొగలు, మంటలు రావడం గమనించిన బస్సు డ్రైవర్ తక్షణమే అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు దిగి లోపల ఉన్న ప్రయాణికులను గట్టిగా అరుస్తూ కేకలు వేసి అప్రమత్తం చేశాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనతో హుటాహుటిన కిందకు పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో డ్రైవర్ త్వరితగతిన స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ప్రయాణికులకు గాయాలు కానీ కాకుండా పెను ప్రమాదం తప్పింది.
* మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న తక్షణమే మీర్పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ప్రధాన రహదారిపై రద్దీ ఏర్పడకుండా వాహనదారుల భద్రతకు తగిన చర్యలు చేపట్టారు. కాగా, ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
