Matrimonial Fraud
* మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం
* రూ.6.26 లక్షలు బదిలీ
Matrimonial Fraud| ఆకేరు న్యూస్, హైదరాబాద్: పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించి డబ్బులు బదిలీ చేయించుకున్న ఘటన సైబరాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నకిలీ ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా జరిగిన ఈ మోసంలో బాధితుడు రూ.6.26 లక్షలు కోల్పోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం
పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన 45 ఏళ్ల ఐటీ ఉద్యోగి వివాహం కోసం సంగం డాట్‌కామ్ లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో జూలై 12న అరుచై శర్మ పేరుతో ఓ మహిళ పరిచయమైనట్లు సమాచారం. మ్యాట్రిమోనియల్ సైట్లో గోప్యత ఉండదంటూ ఆమె టెలిగ్రామ్‌లో మాట్లాడాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వారి మధ్య సంభాషణ కొనసాగినట్లు పేర్కొన్నారు.
వ్యాపార ప్రతిపాదనతో ..
పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వస్తుందని మహిళ సూచించినట్లు తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్‌లోని కస్టమర్లకు మొబైల్స్, వాచీలు, దుస్తులు, కంప్యూటర్లు విక్రయించే ఈ-కామర్స్ వ్యాపారం తనకు ఉందని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తనతో కలిసి వ్యాపారంలో భాగస్వామి కావాలంటూ ఓ వెబ్సైట్ లింక్‌ను పంపి ఖాతా తెరవాలని సూచించినట్లు సమాచారం. ఆన్లైన్లో కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులకు ముందుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, డెలివరీ పూర్తయిన తర్వాత పెట్టుబడితో పాటు భారీ కమీషన్ వస్తుందని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు.
నగదు బదిలీ
ఆ మాటలను నమ్మిన బాధితుడు జూలై 21 నుంచి సెప్టెంబర్ 3 మధ్య తన ఐసీఐసీఐ, స్లైస్ బ్యాంకు ఖాతాల నుంచి 20 లావాదేవీల ద్వారా మొత్తం రూ.6,26,499లను వెబ్‌సైట్‌కు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఈ-సెల్లర్ స్టోర్ వాలెట్లో కనిపిస్తున్న మొత్తాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలిసింది. ఖాతా బ్లాక్ లేదా రిస్ట్రిక్ట్ అయినట్లు కనిపించడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
