Online Betting Case
Online Betting Case| ఆకేరు న్యూస్, డెస్క్: ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. రమ్మీ కల్చర్ యాప్, గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్, రమ్మీటైమ్ టెక్నాలజీస్‌కు సంబంధించిన కేసులో రూ.442.35 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ప్రొవిజనల్‌గా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. సెప్టెంబర్ 25న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ ఆర్డర్ జారీ చేసినట్లు తెలిపింది.
ఏయే ఆస్తులు అటాచ్?
ఈడీ వివరాల ప్రకారం.. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కమర్షియల్ షాపులు, విల్లా, పలు నివాస భవనాలు ఉన్నాయి. ఇవి కంపెనీకి సంబంధించిన షేర్‌హోల్డర్ల కుటుంబ సభ్యులు, ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్టులు, అనుబంధ సంస్థల పేర్లలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
2.3 కేజీల బంగారం, వజ్రాభరణాలు
ఈ కేసులో గతంలో నిర్వహించిన సోదాల్లో రూ.11 లక్షల నగదుతో పాటు సుమారు 2.30 కేజీల బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. వాటి విలువ సుమారు రూ.3.50 కోట్లుగా పేర్కొంది. బ్యాంకు బ్యాలెన్స్‌లు, పేమెంట్ గేట్‌వే నిధులు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ఆస్తులను కూడా గతంలో ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించింది.
3 కోట్ల మంది యూజర్లు
గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్, రమ్మీటైమ్ టెక్నాలజీస్ మొబైల్ యాప్‌ల ద్వారా రమ్మీ వంటి ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ నిర్వహించినట్లు ఈడీ పేర్కొంది. రమ్మీకల్చర్, రమ్మీప్రైమ్, ప్లేస్షిప్, రమ్మీటైమ్ వంటి బ్రాండ్ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నట్లు ఈడీ పేర్కొంది.
బాట్స్‌తో గేమ్స్ ఆడించారన్న ఆరోపణ
కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లు పారదర్శకంగా, సురక్షితంగా ఉంటాయని, బాట్స్ ఉండవని ప్రచారం చేసినప్పటికీ.. యూజర్లకు తెలియకుండా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌లు లేదా బాట్స్‌ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ ఆరోపించింది. దీనివల్ల కొంతమంది యూజర్లు ఆర్థికంగా నష్టపోయారని, కంపెనీలకు అక్రమ ఆదాయం సమకూరిందని ఏజెన్సీ పేర్కొంది.
రూ.2,843 కోట్లకు చేరిన మొత్తం
తాజా రూ.442.35 కోట్ల అటాచ్‌మెంట్‌తో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్, ఫ్రీజ్, సీజ్ చేసిన ఆస్తులు, నిధుల మొత్తం విలువ సుమారు రూ.2,843 కోట్లకు చేరినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
