Kavitha Strategy
* పార్టీ శ్రేణులకు కల్వకుంట్ల కవిత కీలక ఆదేశాలు..
* బంజారాహిల్స్ కార్యాలయంలో వరుస సమీక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత ముమ్మర వ్యూహరచన చేస్తున్నారు. దీనిలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, కార్యకర్తలతో బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో భేటీ అయిన కవిత, సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఇటీవల నిజామాబాద్, కొడంగల్ (కోస్గి)లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభల’ విజయవంతంపై నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు తెలంగాణ రక్షణ సేన నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయాలనే అంశాలపై లోతుగా చర్చించారు.
* స్పందించిన తీరుతోనే ప్రభుత్వం దిగివచ్చింది
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఉదంతంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన తక్షణ పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని కవిత గుర్తుచేశారు. ఏళ్ల తరబడి రిమ్స్ ఆసుపత్రిని పట్టించుకోని సర్కార్, తమ పోరాటం తదనంతరమే తక్షణ చర్యల కోసం రూ. 11 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
తాను స్వయంగా ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవడంతోనే ప్రభుత్వం బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ముందుండి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
* మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట సహా అన్ని ప్రధాన మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో త్వరలోనే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలిపారు.
కాగా, ఈ వరుస సమీక్షా సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల ప్రతినిధులతోను, బుధవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతోను కవిత సమావేశం కానున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
