Kondam Ranga Reddy
* కిష్టాపురంలో సర్పంచ్ కొండం రంగారెడ్డి పర్యటన
ఆకేరు న్యూస్, రాయపర్తి : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, గ్రామ ప్రజల ఆరోగ్యం పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందని కిష్టాపురం గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి, స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా సాగుతున్న ‘స్వచ్ఛ సేవా’ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రంగారెడ్డి, సోమవారం రోజున కిష్టాపురం గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వీధుల్లో ఎక్కడెక్కడ చెత్తాచెదారం పేరుకుపోయిందో, అపరిశుభ్రత నెలకొందో ప్రత్యక్షంగా గుర్తించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… మురికివాడలు, మురుగు కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను తక్షణమే శుభ్రం చేయాలని సంబంధిత పంచాయతీ అధికారులను, పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో అలసత్వం వహించకూడదని, ఏ కొంచెం ఆలస్యం చేయకుండా పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని అధికారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామంలో దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే నిరంతరం శానిటేషన్ పనులు నిర్వహించాలని సిబ్బందిని అలర్ట్ చేశారు. అలాగే గ్రామ ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, చెత్తను వీధుల్లో వేయకుండా పంచాయతీ చెత్త బండ్లలోనే వేసి స్వచ్ఛ కిష్టాపురం నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, లక్ష్మి, వార్డు సభ్యులు, కేమిడి యాదయ్య, గిద్దె వెంకటయ్య, ఈదునూరి కళ్యాణి యాకయ్య, తాళ్లపల్లి బాబు, పారిశుధ్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
