Pillala Jatara 2026
* నవంబర్ 20, 21న వేడుకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో 6వ పిల్లల జాతర నవంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. పిల్లల జాతరలో యాంకరింగ్, జడ్జిమెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను పాఠశాల విద్యార్థులే నిర్వహించడం ప్రత్యేకత అని అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేలా తెలంగాణ బాలోత్సవం చేస్తున్న కృషిని అభినందించారు.

* సివిక్ సెన్స్‌పై దృష్టి
భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సిహెచ్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సివిక్ సెన్స్, మోరల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇవి విద్యార్థులు క్రమశిక్షణతో, ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడతాయని అన్నారు. ప్రముఖ బాలసాహితీవేత్త కాపు వెంకటరమణ, సహజ ఫౌండేషన్ స్థాపకురాలు శైలజ, తెలంగాణ బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నగరంలోని పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లల జాతరను విజయవంతం చేయాలని కోరారు.
* 85 మందితో కమిటీ
ఉత్సవాల నిర్వహణ కోసం తెలంగాణ బాలోత్సవం కమిటీ ఉపాధ్యక్షురాలు సుజావతి 85 మందితో రిసెప్షన్ కమిటీని ప్రకటించారు. కమిటీ చైర్మన్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి, భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సిహెచ్. వేణుగోపాల్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. సమావేశంలో చిల్డ్రన్ సైకాలజిస్ట్ మమత, నాట్య గురువు ఇందిరా పరాశరం, మహేష్ దుర్గే, బ్రాహ్మణి తదితరులతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
