Cyber Fraud
* 98.82 లక్షలు స్వాహా
Cyber Fraud| ఆకేరు న్యూస్, సైబరాబాద్: బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన ఉన్న ఓ బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. భారీ లాభాల పేరుతో నమ్మించి ఏకంగా రూ.98.82 లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయం
పోలీసుల కథనం ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ప్రముఖ ఆర్థిక సంస్థను పోలిన ‘హెచ్ఎస్ఎల్ క్యాపిటల్’ అనే నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ ఉన్మేష్ శర్మ, నిషా వర్మ తదితర పేర్లతో వాట్సాప్ గ్రూపుల ద్వారా రిటైర్డ్ చీఫ్ మేనేజర్‌ను సంప్రదించారు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
తొలుత రూ.20 వేల పెట్టుబడి
వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట రూ.20 వేలతో ట్రేడింగ్ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు నిర్వహించిన యాప్‌లో పెట్టుబడిపై భారీ లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. దీంతో బాధితుడికి వారిపై నమ్మకం పెరిగింది. అనంతరం సూచనల మేరకు అనావిల్ వైర్స్, సన్‌షైన్ పిక్చర్స్, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ వంటి ఐపీఓల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.
విత్‌డ్రా పేరుతో మోసం
యాప్‌లో పెట్టుబడులకు భారీ లాభాలు వచ్చినట్లు కనిపించినప్పటికీ వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో బాధితుడు నిందితులను సంప్రదించారు. ఐటీ చట్టం కింద సబ్స్క్రిప్షన్ ట్యాక్స్‌లు, ఈడీ పరిశీలన పేరుతో ప్రొటెక్షన్ డిపాజిట్లు, ఎక్స్‌ప్రెస్ ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలంటూ దఫదఫాలుగా డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తం రూ.98.82 లక్షలు తీసుకున్నారు.
అసలు విషయం తెలిసి..
చివరకు అనుమానం వచ్చిన బాధితుడు హెచ్డీఎఫ్సీ కస్టమర్ కేర్‌ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించారు. ‘హెచ్ఎస్ఎల్ క్యాపిటల్’తో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, అది నకిలీ సంస్థ అని తెలియడంతో మోసపోయినట్లు గుర్తించారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
