Minor Social Media Rules
Minor Social Media Rules| ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నేరుగా చట్టబద్ధ ఒప్పందాలు చేసుకోకుండా నిరోధించేందుకు నిబంధనలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెల్లడించారు.
మైనర్ల సోషల్ మీడియా వినియోగానికి భద్రతా చర్యలు కల్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది.
తల్లిదండ్రుల అనుమతి
18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవడం, ఆయా ప్లాట్‌ఫారమ్‌ల నిబంధనలను అంగీకరించడం వంటి అంశాల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి చేయాలా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
మైనర్లు స్వతంత్రంగా చట్టబద్ధ ఒప్పందాలు చేసుకోలేరని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల సోషల్ మీడియా సంస్థలు మైనర్లతో నేరుగా ఒప్పందాలు చేసుకోకుండా, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ధ్రువీకరించిన అనుమతితో ఖాతాలను నిర్వహించేలా నిబంధనలు తీసుకురావాలని కోరారు.
ఆన్లైన్ ప్రమాదాలు
మైనర్లు సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో ఆన్లైన్ గ్రూమింగ్, లైంగిక దోపిడీ, ట్రాఫికింగ్, సెక్స్టార్షన్, సైబర్‌బుల్లీయింగ్, వయసుకు అనుచితమైన కంటెంట్, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని పిటిషన్లో ఆందోళన వ్యక్తమైంది. మైనర్ల వయస్సును ధ్రువీకరించడంతో పాటు వారికి అదనపు ఆన్లైన్ భద్రతా చర్యలు కల్పించాలని పిటిషనర్లు కోరారు.
పూర్తిగా నిషేధం కాదు
పిల్లలు డిజిటల్ కంటెంట్‌ను పూర్తిగా వినియోగించకుండా నిరోధించడం తమ ఉద్దేశం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. విద్య, పరిశోధన వంటి అవసరాల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ కొనసాగించేలా నిబంధనలు ఉండాలని ప్రతిపాదించారు.
ఇంకా తుది నిర్ణయం లేదు
మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ప్రస్తుతం PILపై విచారణ కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి చట్టబద్ధమైన వ్యవస్థను రూపొందించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
