Cyber Crime
ఆకేరు న్యూస్, హైదరాబాద్: డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి, ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించి వీడియో కాల్లో అతడి ప్రైవేట్ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో బాధితుడి నుంచి నిందితులు రెండు రోజుల్లో ఏకంగా రూ.9.48 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డేటింగ్ యాప్లో పరిచయం
పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి ‘సృష్టి గుప్తా’ పేరుతో ఓ యువతి ఐస్ల్లే (Isle) డేటింగ్ యాప్లో పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే చాటింగ్ ద్వారా సన్నిహితంగా మారి, ఆ తర్వాత వాట్సాప్లో మాట్లాడటం ప్రారంభించింది. తీయని మాటలతో బాధితుడి నమ్మకాన్ని సంపాదించిన ఆమె.. వీడియో కాల్కు కూడా ఒప్పించింది.
వీడియో రికార్డు చేసి బెదిరింపులు
వీడియో కాల్లో బాధితుడు సెమీ న్యూడ్ స్థితిలో ఉన్న సమయంలో అతడికి తెలియకుండా ప్రైవేట్ దృశ్యాలను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో వ్యక్తి రంగంలోకి వచ్చి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. పరువు పోతుందనే భయంతో బాధితుడు వారు అడిగిన డబ్బును చెల్లించడం ప్రారంభించాడు.
27 విడతల్లో రూ.9.48 లక్షలు
కేవలం రెండు రోజుల్లోనే బాధితుడు 27 విడతలుగా రూ.9.48 లక్షలను నిందితుల ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన బ్యాంకు ఖాతాలో లావాదేవీల పరిమితి పూర్తవడంతో స్నేహితుడి ఖాతా ద్వారా కూడా డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
అయినా నిందితుల వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు చివరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అపరిచితులతో జాగ్రత్త
డేటింగ్ యాప్లు, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచితులతో వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రైవేట్ దృశ్యాలను రికార్డు చేసి బెదిరిస్తే భయపడి డబ్బులు చెల్లించకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
