Hyderabad Crime
Hyderabad Crime| ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పీహెచ్డీ విద్యార్థి హత్య కలకలం రేపింది. కోకాపేట నియోపోలిస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.
బ్యాట్‌తో దాడి?
మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటూ పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిసింది. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
కోకాపేటలో మృతదేహం
వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కోకాపేటకు తీసుకొచ్చి పడేసి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యకు వ్యక్తిగత వివాదాలు, పాత కక్షలు లేదా ఆర్థిక వ్యవహారాలు కారణమయ్యాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
కుటుంబంలో విషాదం
వెంకన్నకు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆయన అనూహ్యంగా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు, ఓయూ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
