అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, పవన్ సాధినేని, అల్లు అరవింద్
* దుల్కర్ కెరీర్లో మరో మైలురాయి అవుతుంది..
* మనమందరం గర్వపడే సినిమా అవుతుంది – దుల్కర్ సల్మాన్
ఆకేరు న్యూస్, సినిమా: వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఎమోషనల్ డ్రామా (Emotional Drama) ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (Pre-release Event) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా దుల్కర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దుల్కర్ అద్భుతమైన నటుడు: అల్లు అర్జున్
వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మలయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని ప్రశంసించారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ దుల్కర్ మంచి మనిషని, అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ఆయన ప్రత్యేకతని అన్నారు.
దుల్కర్ నిర్మించిన ‘లోక’ సినిమా కూడా తనకు బాగా నచ్చిందని అల్లు అర్జున్ తెలిపారు. ‘ఆకాశంలో ఒక తార’ ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమవుతున్న సాత్వికకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ నటనను కూడా ప్రశంసించారు.
దర్శకుడు పవన్ సాధినేని ప్రతిభను ఈ సినిమాలో చూడవచ్చని అన్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌కు ఈ సినిమా కథ ఎంతో నచ్చిందని, ఆయన కూడా చిత్రంపై ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ప్రతి అమ్మాయి కల నెరవేరాలనే అందమైన సందేశంతో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రం: దుల్కర్
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతారామం’ తర్వాత ఈ కథ విన్నానని, మొదటిసారి కథ విన్నప్పుడే ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. ఇది తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన అల్లు అరవింద్, స్వప్న దత్, గుణ్ణం గంగరాజు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని కూడా దుల్కర్ పంచుకున్నారు. తన తొలి సినిమా షూటింగ్ సమయంలో కేరళలోని ఓ ఇంట్లో అల్లు అర్జున్ ఫొటో ఉండేదని గుర్తుచేసుకున్నారు. అప్పటికే ఆయన పెద్ద స్టార్‌గా గుర్తింపు పొందారని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని అన్నారు. ‘అల వైకుంఠపురములో’ తనకు ఇష్టమైన సినిమాల్లో ఒకటని, కరోనా సమయంలో కుటుంబంతో కలిసి పలుమార్లు చూశానని తెలిపారు. తన కుమార్తె కూడా అల్లు అర్జున్‌కు అభిమానని, ఆయన ఈ వేడుకకు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
ప్రతి అమ్మాయి కల నెరవేరాలి: పవన్ సాధినేని
దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. తన తొలి చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ తనను ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఆయన చెప్పిన మాటలు గత 13 ఏళ్లుగా తనకు స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలో ఈ సినిమా కథను రాసుకున్నానని, అల్లు అరవింద్, గుణ్ణం గంగరాజులకు కథ చెప్పినప్పుడు వారికి బాగా నచ్చిందని చెప్పారు.
దుల్కర్ సల్మాన్ మొదటి నుంచి తనపై నమ్మకం ఉంచారని, ఆయన సహకారం లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. సాత్విక అద్భుతంగా నటించిందని, శ్రుతి హాసన్ కథ విన్న వెంటనే తన పాత్రకు అంగీకరించడం ప్రత్యేకమని తెలిపారు. ప్రతి అమ్మాయి తన కలలను సాకారం చేసుకోవాలనే స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమాను రూపొందించినట్లు వెల్లడించారు.
సాత్వికతో మరో రెండు సినిమాలు: అల్లు అరవింద్
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆకాశంలో ఒక తార’ కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఇలాంటి మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచన తనకు ఉత్సాహాన్నిచ్చిందన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక అద్భుతంగా నటించారని ప్రశంసించారు. సాత్విక తన పాత్రలో సహజంగా ఒదిగిపోయిందని, భవిష్యత్తులో మంచి నటిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సరదాగా ఆమెతో మరో రెండు సినిమాలకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకున్నానని వెల్లడించారు.
నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. దుల్కర్ ఫోన్ చేసి కథ వినాలని చెప్పడంతో తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని తెలిపారు. కథ విన్న తర్వాత ఇలాంటి మంచి కథలు మళ్లీ మళ్లీ వస్తాయో లేదో అనిపించిందని, ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. నిర్మాతలు సందీప్ గున్నం, రమ్య గున్నం కూడా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
నవంబర్ 20న పాన్ ఇండియా విడుదల
ఈ సినిమాతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో తన పాత్ర పేరు బిజిలి అని రుహాని శర్మ వెల్లడించారు. మన పరిస్థితుల కారణంగా కలలను పరిమితం చేసుకోకూడదనే సందేశం ఈ సినిమాలో ఉందని తెలిపారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం (Music) అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో (Pan India) థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

