Gandhi Jayanti liquor sales
* గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాల ఆరోపణలు
*ఉమ్మడి వరంగల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపుల దందా..
*అధికారుల తనిఖీలపై ప్రశ్నలు
అకేరు న్యూస్, వరంగల్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వైన్ షాపులు, బార్లు మూసివేయాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా హనుమకొండ, హసన్పర్తి, డబ్బాల ప్రాంతాలతో పాటు కేయూ పరిసరాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిరోడ్డుపైనే మద్యం విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు, మద్యం విక్రయాలపై ఉన్న ఆంక్షలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*ఫోన్ చేసినా స్పందన లేదంటున్న స్థానికులు
తమ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్న విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించడం లేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా విద్యాసంస్థలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల సమీపంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. గాంధీ జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో కూడా బెల్ట్ షాపులు కొనసాగితే.. నిబంధనలు ఎవరి కోసం అన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి.
*అధికారుల తీరుపై అనుమానాలు
ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించిన రోజుల్లో కూడా బెల్ట్ షాపుల్లో మద్యం అందుబాటులోకి వస్తుండటంపై ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు సమాచారం అందుతున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బెల్ట్ షాపులపై అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం? అన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, హసన్పర్తి, కేయూ పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అయితే, ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. సంబంధిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
