TamilNadu CM Vijay Free Gold Ring Scheme
* మహిళలకు ఫ్రీ టికెట్లు..
ఆకేరు న్యూస్, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వినూత్న రీతిలో ప్రజలను ఆకట్టుకున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ‘వెట్రి పయనం’ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా బస్సులోకి ఎక్కి కాసేపు కండక్టర్గా మారారు. ప్రయాణికులకు ఉచిత టికెట్లు అందిస్తూ.. మహిళలతో మాట్లాడి వారి ప్రయాణ అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం విజయ్ బస్సులోకి సడన్గా రావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, కాలేజీ విద్యార్థినులు ఉత్సాహంగా స్పందించారు.
* మహిళలకు మరిన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం
తమిళనాడులో ఇప్పటికే అమల్లో ఉన్న మహిళల ఉచిత బస్ ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. ఇప్పటివరకు ప్రధానంగా సాధారణ సిటీ బస్సుల్లో అమలవుతున్న ఉచిత ప్రయాణ సదుపాయం ఇకపై ఎక్స్ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్ (LSS), డీలక్స్ బస్సులకు కూడా వర్తించనుంది. అలాగే జిల్లాల మధ్య నడిచే సాధారణ మోఫుసిల్ బస్సులు, 40 కిలోమీటర్లకు మించిన కొండ ప్రాంతాల సాధారణ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఈ విస్తరించిన ‘వెట్రి పయనం’ పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 12,692 బస్సులను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది.
* ప్రయాణికులతో మాట్లాడిన సీఎం..
పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సీఎం విజయ్ బస్సులో ప్రయాణిస్తూ కండక్టర్ పాత్ర పోషించారు. మహిళా ప్రయాణికులకు స్వయంగా ఉచిత టికెట్లు అందించారు. అనంతరం వారితో మాట్లాడి పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై ఆరా తీశారు. ఉద్యోగాలు, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం ప్రజా రవాణాపై ఆధారపడే మహిళలకు ఈ విస్తరణ మరింత ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
* విద్యార్థినులు ఇచ్చిన చాక్లెట్లు.. వైరల్
బస్సులో సీఎం విజయ్ను చూసిన కొందరు కాలేజీ విద్యార్థినులు ఆయనకు చాక్లెట్లు ఇచ్చారు. విద్యార్థినులు అందించిన చాక్లెట్లను విజయ్ స్వీకరించి తన జేబులో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో చోటుచేసుకున్న సరదా, ఆప్యాయతతో కూడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీఎం విజయ్ కండక్టర్గా మారి మహిళలకు టికెట్లు అందిస్తున్న దృశ్యాల వీడియోలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘వెట్రి పయనం’ పథకం ద్వారా సాధారణ బస్సులతో పాటు మరిన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణించి మహిళలకు టికెట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.
