Bapu Ghat Hyderabad
సీఎం రేవంత్, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పుష్పాంజలి
అకేరు న్యూస్,హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో కలిసి బాపూ ఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి.. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
గాంధీజీ జయంతి సందర్భంగా బాపూ ఘాట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ జీవితం, ఆయన ఆలోచనా విధానం, స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన పాత్రను ప్రజలకు మరింత చేరువ చేసేలా డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
అలాగే ప్రభుత్వ సలహాదారులు వీ. హనుమంతరావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా బాపూ ఘాట్ వద్ద గాంధేయ విలువలను స్మరించుకుంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
